నీటి వాటాపై రాజీపడే ప్రసక్తే లేదు: ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ సమీక్ష
  • తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న ఉత్తమ్
  • జలవివాదాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు

తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఫోకస్ పెట్టింది. సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుంగభద్ర డ్యామ్ పరిధిలో తెలంగాణకు రావాల్సిన కృష్ణా నదీ జలాల వాటాపై ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఆర్డీఎస్ కింద తెలంగాణకు చట్టబద్ధంగా కేటాయించిన నీటి వాటా విషయంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.


తుంగభద్ర జలాల వినియోగంలో ఎగువ రాష్ట్రాలు (కర్ణాటక, ఏపీ) తీసుకునే ఏకపక్ష నిర్ణయాల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అంతర్రాష్ట్ర సమావేశాల వేదికగా తెలంగాణ హక్కులను చాలా బలంగా వినిపించాలని స్పష్టం చేశారు.


కృష్ణా పరీవాహక ప్రాంత రైతుల సాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలపై చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను వెంటనే సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.


Uttam Kumar Reddy
Telangana water rights
Rajolibanda Diversion Scheme
Tungabhadra Dam water sharing
Krishna River dispute
Telangana Irrigation Department

More Telugu News